పరిటాల రవీంద్ర చెరగని ముద్ర
ప్రజా నాయకుడా నీకు అల్విదా
హైదరాబాద్ – ప్రజా నాయకుడిగా ప్రజల మన్ననలు అందుకున్న అరుదైన వ్యక్తి పరిటాల రవీంద్ర. ఇవాళ ఆయన వర్దంతి. అనంతపురం జిల్లా లోని వెంకటాపురంలో పుట్టిన పరిటాల రవీంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆగస్టు 30, 1958లో పుట్టారు. కేవలం 46 ఏళ్ల వయసులోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు కొడుకులు ఒక కూతురు. ప్రస్తుతం పరిటాల రవీంద్ర భార్య పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పని చేశారు.
శాసన సభ్యుడిగా, మంత్రిగా, ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇదే సమయంలో ఎందరో ప్రత్యర్థులను మట్టు పెట్టారన్న ఆరోపణలు లేక పోలేదు. ఇదంతా పక్కన పెడితే వామపక్ష భావజాలం కలిగిన పరిటాల రవీంద్రకు ప్రజలంటే వల్లమాలిన అభిమానం.
రవి తండ్రి పరిటాల శ్రీరాములు కూడా ప్రజా నాయకుడే. భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను సాధారణ రైతులకు పంపిణీ చేశాడు. ఆయన కూడా ప్రత్యర్థుల చేతుల్లో హతమయ్యాడు. ఆయన జీవితం ఆధారంగా ఎన్. శంకర్ శ్రీరాములయ్య పేరుతో సినిమా తీశాడు. రవి జీవితంపై రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పేరుతో చిత్రం చేశాడు.
1975లో భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు కుట్ర పన్ని రవి తండ్రి పరిటాల శ్రీరాములును, ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని హత్య చేశారు. తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. కుటుంబం అభద్రతా భావంతో బతుకుతోంది.
కన్నబిడ్డల కోసం గుండె ధైర్యంతో బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు రవి. తమ్ముడు హరితో పాటు రేయింబగళ్ళు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తీర్చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. పరిటాల హరి మరణంతో ప్రాంతమంతట మళ్ళీ చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. అరాచకం ప్రబలింది.
భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్ట కాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది. పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ మద్దెల చెరువు గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని 1983లో అనంతపురం లో అన్నపూర్ణ వద్ద చంపారు.
ఈ హత్య కేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటి నుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచ్చాడు పరిటాల రవీంద్ర. 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కాంగ్రసేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు.
కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపాడు పరిటాల రవీంద్ర. తనదైన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. ప్రజానాయకుడుగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేయటం ప్రారంభించాడు.
రాష్ట్రంలో జరిగిన తొలి మండల వ్యవస్థ ఎన్నికలలో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బూటకపు ఎన్-కౌంటర్ ల వెనుక కీలకమైన వ్యక్తి సానే చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు.
భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికలు ప్రచారానికి వస్తున్న చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నాడు పరిటాల రవీంద్ర. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్నిచ్చింది.
శాసన సభ్యుడిగా చెన్నారెడ్డి కక్షకట్టి తనకు వ్యతిరకంగా పని చేసిన వారి మీద, ప్రధానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్దఎత్తున దాడులు ప్రారంభించాడు. కుంటిమద్ది, గడిగకుంట, ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టంచాడు. అనేక కుటుంబాలను గ్రామాల నుండి తరిమేశాడు.
1991 మే నెల 7వ తేదీన పీపుల్స్ వార్ నక్సలైట్లు చెన్నా రెడ్డిని కాల్చి చంపారు. చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవీంద్ర స్వగ్రామానికి సమీపంలో వున్న కొత్త గదిగాకుంట గ్రామం మీదకి మారణాయుధాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు.
పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో చెన్నారెడ్డి పెద్దకొడుకు ఎస్.వి. రమణారెడ్డి శాసనసభ్యుడిగా గెలిచాడు. రమణారెడ్డి తమ్ముడు ఓబుల్రెడ్డి, మాజీ శాసనసభ్యుడి కుమారులు సూర్యనారాయణరెడ్డి (సూరి), రఘునాధరెడ్డి వాళ్ళ అనుచరులు సాగించిన అరాచకాలతో పెనుగొండ ధర్మవరం ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.
హత్యలు, అపహరణలు, మానభంగాలు నిత్యాకృత్యాలుగా మారిపోయాయి. 1991 నుంచి విశ్రుంఖల స్వైర విహారం చేస్తున్న అరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వరా ఎదుర్కోవడం వల్ల పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు.
తననీ, తన అనుచరుల్ని నక్సలైట్లుగా చిత్రించి మట్టు పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది. 1992 లో జిల్లా ఎస్పీ కె. వి. రెడ్డి సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోయాడు.
ధర్మవరంలో ఓబులరెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదురించిన మొదటి వ్యక్తి షాక్ ముష్కిన్. మాజీ తీవ్రవాది అయిన ముష్కిన్ పరిటాల రవికి సన్నిహితుడు.1993 సెప్టెంబరు 23న ఎస్వీ సోదరులు,సూరి సోదరులు ముష్కిన్ ని దారుణంగా చంపారు.
1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఒక్క అనంతపురం జిల్లా మాత్రమే గాక రాయలసీమకు చెందిన టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరధం పట్టారు.1993 అక్టోబరు 24న మద్దలచెరువు గ్రామంలో టి.వి బాంబు సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సూరి తమ్ముడు రఘునాధరెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు.
ఈ సంఘటనకు ప్రధాన కారకుడు పరిటాల రవేనని కాంగ్రెస్ నాయకులు విమర్శల వర్షం కురిపించారు.1994 జూన్ 17న వై.యస్.రాజారెడ్డి వెంకటాపురం వెళ్ళి పరిటాల రవిని కలిశాడు. రాజారెడ్డి-రవీంద్రల కలయిక కాంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టించింది.
ఆగష్టు 7న హైదరాబాద్ సమీపంలోని షాద్నగర్ లో జంట హత్యలు జరిగాయి. హతులిద్దరూ పెనుగొండ శాశానసభ్యుడు ఎస్.వి.రమణారెడ్డి అనుచరులు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి పరిటాల రవి. వేరే కేసులో పెండింగ్ లో వున్నా వారంట్ కింద రవి న్యాయస్థానం అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ప
రిటాల రవి అనుచరులకీ ఎస్వి సోదరులుకీ మధ్య ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైంది. జైలునించే పరిటాల రవి నామినేషాన్ దాఖలు చేశారు. అన్ని అవాంతరాలను అధిగమించి అత్యధిక ఆధిక్యంతో విజయం సాధించాడు.
ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రి అయ్యాడు. ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగు జాడల్ని అనుసరించింది అంటే అతిశయోక్తి కాదు. అధికార బలంతో శత్రు సంహారం సాగిస్తాడని అనుకున్న ప్రత్యర్థుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తు చేశాడు.
ఆ తర్వాత ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజా నాయకుడిగా ప్రజల కోసం పని చేశాడు. 2005 జనవరి 24న టీడీపీ కార్యాలయంలో హాజరైన పరిటాల రవీంద్రను దారుణంగా కాల్చి చంపారు.