స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ – లే ఔట్ ఏదైనా అందులోని పార్కులు, రహదారులు మారవని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే ఆ లేఔట్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో మార్పులు చేయాల్సి ఉంటే..అప్పటికే ప్లాట్ల కొన్నవారి అనుమతితో రివైజ్ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే 10 శాతం పార్కులు, ప్రజావసరాలకు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు.
పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ ఎండీఏ ఇలా ఏ స్థాయిలో లే ఔట్ అనుమతులు పొందినా.. అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలపై ప్రభుత్వానికి హక్కులు ఉంటాయనన్నారు. అన్ ఆథరైజ్డ్, అన్ అప్రూవల్ , అప్రూవల్ లే ఔట్లు ఏంటి..? వాటికి సంబంధించిన జీవోలను పరిశీలించారు. ఎకరం స్థలంతో మొదలై.. ఎంత విస్తీర్ణంలో అయినా లే ఔట్లు వేసుకోవచ్చనని పేర్కొన్నారు.
దశాబ్దాల క్రితం గ్రామపంచాయతీలు అనుమతి ఇచ్చిన లే ఔట్ల విషయం రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదరు భూమి లే ఔట్‌గా మారిందనే విషయం రెవెన్యూ రికార్డులలో నమోదు కాక పోవడంతోనే.. తర్వాత తరం వారు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఆయా స్థలాల మీదకు వెళ్లి.. వ్యవసాయ భూమి పేరిట ఆక్రమణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ అనుమతి పొందిన పాత లే ఔట్ల విషయంలో కొన్ని ప్లాట్లు రెగ్యులరైజ్ అయితే ఆ లే ఔట్‌ను గుర్తించినట్టేనని అన్నారు. తర్వాత ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం జరగదని, ఒక వేళ రద్దు చేస్తే అందులో ప్లాట్లు కొన్న వారి అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ప్రిలిమనరీ అప్రూవల్‌తో అమ్మకాలు జరపవచ్చునని పేర్కొన్నారు. అయితే లే ఔట్ స్వరూపం మారరాదని చెప్పారు.