వైభవోపేతం పార్వేట ఉత్సవం
ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవం
తిరుపతి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలిసిల్లుతున్ శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామి వారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరిగి ఆలయానికి తీసుకు వచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.