పల్లెల అభివృద్దిపై దృష్టి సారించాలి
పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ కొణిదెల
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయా శాఖలకు సంబంధించిన బదిలీలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే పల్లె సీమల పురోభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం.
స్థానిక సంస్థలను బలోపేతం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు కొణిదెల పవన్ కళ్యాణ్. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీలోని గ్రామాలను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చిన వెంటనే ప్రక్షాళన చేయడం ప్రారంభించడం జరిగిందని చెప్పారు డిప్యూటీ సీఎం.
ప్రస్తుతం ఆయా శాఖలలో జరిగిన బదిలీలు పూర్తిగా పారద్శకతతో జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారు ప్రభుత్వ ఆలోచనలను , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని ప్రకటించారు.
పల్లెల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉపాధి హామీకి రూ.4500 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆ నిధులను సద్వినియోగం చేయడంలో అధికార యంత్రాంగానిది కీలక పాత్ర ఉంటుందన్నారు. అధికారుల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టం చేశారు.