శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
తిరుమల సన్నిధిలో కూతుళ్లు కూడా
తిరుమల – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూతురు , కుటుంబీకులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయన తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన 11 రోజుల పాటు దీక్ష నిర్వహించారు. ఇవాళ శ్రీ వేంకటేశ్వర స్వామి , అలివేలు మంగమ్మ సాక్షిగా ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
అంతకు ముందు తిరుపతి లోని అలిపిరి శ్రీవారి మెట్లు మీదుగా కొండపైకి నడిచి వచ్చారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అన్య మతస్తులు ఎవరైనా దర్శించుకుంటే ముందుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయాలి. ఇప్పటికే డిక్లరేషన్ వివాదంతో పాటు తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందనే దానిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూతుళ్లు కూడా ఆయనతో పాటు స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పలీనా అంజనీ కొణిదెల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారు.
టీటీడీ ఉద్యోగులు తీసుకు వచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా పలీనా అంజని కొణిదెల మైనర్ కావడంతో తండ్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పత్రాలపై సంతకాలు చేశారు.