NEWSANDHRA PRADESH

బాధితుల‌కు భ‌రోసా ప్ర‌భుత్వం ఆస‌రా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజల ప్రాణ రక్షణే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు. బుడమేరు నిర్వహణపై గత ప్రభుత్వం శ్రద్ధ పెట్ట లేద‌ని, వారి నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఇవాళ విజ‌య‌వాడ‌కు ఇంతటి ముప్పు ఏర్ప‌డింద‌న్నారు.

గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్రతి నగరానికీ పకడ్బందీ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా వ‌ర‌ద బాధితుల కోసం సీఎం స‌హాయ నిధికి రూ. కోటి విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

విపత్తు సమయంలో నిందలు వేయడం కంటే సాయం చేసేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఇలాంటి విపత్తు సంభవించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

భారీ వర్షాలు, ఎగువ ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితోనే మన ప్రాంతానికి విపరీతమైన నష్టం వాటిల్లిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఎప్పుడూ రానంత వరద ఇద‌ని తెలిపారు.

వరదలు తగ్గు ముఖం పట్టిన తరవాత రాష్ట్రంలోని ప్రతి నగరానికీ పకడ్బందీగా ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.