పవన్ కళ్యాణ్ సంతాపం
అమరావతి – ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 20 మంది దుర్మరణం చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు జాగ్రత్తగా ఉండాలని, తొందర పడవద్దని పవన్ సూచించారు.
ఇదిలా ఉండగా ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పోవడంతో అదుపు తప్పి పడి పోయారు భక్తులు ఒకరిపై మరొకరు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, వారిని స్థానిక అంబులెన్స్ లలో ఆస్పత్రులకు తరలించడం జరిగిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.
మరో వైపు సంఘటన జరిగిన వెంటనే స్పందించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఆయన సీఎం యోగితో ఫోన్ లో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రయాగ్ రాజ్ లో ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ లో ఉందన్నారు సీఎం. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా వాకబు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయమైన చేసేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.