ఘోర ప్రమాదంపై పవన్ కళ్యాణ్ ఆరా
అమరావతి – అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రై. లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు.
ఈ యజమానులు ఇద్దరి మధ్యన విభేదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. రియాక్టర్ పేలి ఈ ప్రమాదం సంభవించిందని బయటకి ప్రచారం జరుగుతున్నా సాల్వెంట్ ఆయిల్ ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో పవన్ కళ్యాణ్ తన పర్యటన యోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు. భారీ స్థాయిలో ప్రమాదం జరగడం 18 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలచివేసిందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాట్లాడారు. ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్ ప్రాముఖ్యతపై సూచనలు చేశారు.
ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయం చేసుకుని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలని అన్నారు.