జై భవానీ..జై శివాజీ.. జై మహారాష్ట్ర
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మహారాష్ట్ర – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్బంగా తాను ప్రచారం చేయడం, ఆయా నియోజకవర్గాలలో గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. శనివారం ఆయన ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎన్డీయే మహాయుతికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ఈ గెలుపు దక్కిందని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్దిని, సుస్థిరతమైన, సుపరిపాలనను కోరుకున్నారని ఈ ఫలితాలు చూస్తే తెలుస్తుందన్నారు.
మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధి, నిజాయితీ, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతం, సనాతన ధర్మం, విభజనపై ఐక్యత , వికసిత్ భారత్ , వికసిత్ మరాఠా కావాలని కోరుకున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. సత్యం, శౌర్యం, న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భూమి మరోసారి ప్రగతి పథాన్ని ఎంచుకుందన్నారు .
షిండే సర్కార్ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని తెలిపారు. కొత్త సర్కార్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా ముందుకు వెళుతుందని తనకు నమ్మకం ఉందన్నారు పవన్ కళ్యాణ్.