సీఎం సహాయ నిధికి పవన్ కోటి విరాళం
రేవంత్ రెడ్డికి అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం
హైదరాబాద్ – ప్రముఖ నటుడు, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఇటీవలే చేసిన ప్రకటన మేరకు తన ఉదారతను చాటుకున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారీగా దెబ్బ తిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దీంతో మానవతా దృక్ఫథంతో తన వంతు బాధ్యతగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ. 6 కోట్లను తను సంపాదించిన దాంట్లోంచి దానంగా (విరాళంగా) ఇస్తున్నట్లు ప్రకటించారు. మిగతా నటీ నటులను, సినీ రంగాన్ని విస్తు పోయేలా చేశారు.
ఏపీ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రూ. ఒక కోటి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఇదే సమయంలో రూ. 4 కోట్ల రూపాయలను 400 గ్రామ పంచాయతీలకు అందజేశారు.
తాజాగా రేవంత్ రెడ్డిని కలుసుకుని రూ. కోటి చెక్కును విరాళంగా తెలంగాణ వరద బాధితుల కోసం అందజేశారు. ఈ సందర్భంగా అనుముల రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను అభినందనలతో ముంచెత్తారు. మరికొందరు తమ వంతు సాయం చేయాలని కోరారు సీఎం.