పోటెత్తిన జనం డిప్యూటీ సీఎం అభయం
పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ సక్సెస్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ చేపట్టారు. మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం చేపట్టిన దర్బార్ కు పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. ప్రతి ఒక్కరి నుంచి పవన్ కళ్యాణ్ వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలు తెలుసుకునేందుకు మరోసారి జనం వద్దకు వచ్చారు.
బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ విన్నవించారు.
సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని కోరారు.
కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన కృష్ణవేణి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు.
విజయవాడ రాజరాజేశ్వరి పేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని వాపోయారు.