చిత్తూరులో కూటమిదే గెలుపు
స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
తిరుపతి – ఈసారి ఎలాగైనా సరే జనసేన , టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని అందుకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయ యాత్ర చేపట్టారు. శనివారం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి కూటమి తరపున దగ్గుమళ్ల ప్రసాద రావు పోటీ చేస్తున్నారు. అనూహ్యంగా ఇక్కడ టికెట్ మార్చారు.
వైసీపీకి చుక్కలు చూపించాలని, అద్భుతమైన విజయాన్ని నమోదు చేయాలని పిలుపునిచ్చారు. భారీ మెజారిటీ రావాలని, ఇందు కోసం ప్రతి కార్యకర్త సైనికుడు కావాలని కోరారు పవన్ కళ్యాణ్. పార్టీ పరంగా తమ వంతు సహకారం ఉంటుందన్నారు.
బరిలో ఎవరు ఉన్నా సరే మనందరం ఆ అభ్యర్థుల గెలుపు కోసం నిద్రహారాలు మాని కృషి చేయాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాక్షస పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మూడిందని, ఇక ఇంటికి వెళ్లడమే మిగిలి ఉందని పేర్కొన్నారు జనసేనాని.