సత్యం ఏమిటనేది త్వరలో తేలుతుంది
స్వతంత్ర సిట్ ఏర్పాటుకు స్వాగతం
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
.సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారని వాపోయారు. గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామి వారికి చేసే కైంకర్యాలు కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు… అన్నిటా నాణ్యత ప్రమాణాలు లోపించాయని బాధ పడ్డారని అన్నారు పవన్ కళ్యాణ్
భక్తులు ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్ళు చేసిన నిర్ణయాలు, వారి పాలన తీరును సమగ్రంగా సమీక్షించి, సంస్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తప్పుడు నిర్ణయాలకు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు.