స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖలు రాశారు.
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. విజయనగరంలో ఒక యువకుడికి ఐ.ఎస్.తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో మన రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాల్సిన వసరం ఉందన్నారు.