లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం కామెంట్స్
స్వచ్ఛమైన నెయ్యి రూ. 360కే ఎలా వస్తుంది
అమరావతి – దేశ వ్యాప్తంగా తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పలు చోట్ల రాద్దాంతం చోటు చేసుకుంది. ఇదే సమయంలో దేశంలో కోట్లాది మంది సవాలక్ష సమస్యలతో సతమతం అవుతుంటే ఒక్క లడ్డూ అంశాన్ని పట్టుకుని వేలాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ప్రముఖ తమిళనాడు రాజకీయ పార్టీ నేత సీమాన్. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఓ వైపు జనం నానా తంటాలు పడుతుంటే ఇంకో వైపు మతం పేరుతో, ప్రసాదం పేరుతో, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన లేవదీసిన ప్రశ్నలు ఆలోచింప చేసేలా ఉన్నాయి.
ఈ తరుణంలో లడ్డూ కల్తీకి సంబంధించి మరోసారి స్పందించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల. ఆయన ఏకంగా అన్నింటిని అరికట్టాలంటే సనాతన ధర్మం పేరుతో ఓ బోర్డు ఉండాలని ప్రతిపాదించారు. దీనికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక హిందూ బంధువులంతా పవన్ కు మద్దతు ఇస్తున్నారు.
ఇదే క్రమంలో తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు పవన్ కళ్యాణ్. స్వచ్ఛమైన నెయ్యి లీటర్ రూ. 360కి కొనడం సాధ్యం కాదని పేర్కొన్నారు. లడ్డూను తయారు చేసేందుకు రోజుకు 15,000 కిలోల నెయ్యి కావాల్సి ఉంటుందన్నారు. నెయ్యి చాలా ఖర్చుతో కూడుకున్నదని, దానిని అంత తక్కువకు ఎలా ఇస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.