మందకృష్ణ పోరాటం అద్భుతం – పవన్
ఎస్సీలు కలిసి కట్టుగా ఉండాలని పిలుపు
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల మేరకు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణలో మార్పులు చేసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు వీలు కల్పించడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా గత 30 సంవత్సరాలుగా మాదిగలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని పోరాటం చేస్తూ వచ్చారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.
ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై స్పందించారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాల, మాదిగలు కలిసికట్టుగా ఉండాలని కోరారు. ఇదే సమయంలో సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాలు చేసిన మందకృష్ణ మాదిగను అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్గీకరణతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.