NEWSANDHRA PRADESH

జ‌ల జీవ‌న్ మిష‌న్ కు స‌హ‌క‌రించండి

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి మోడీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విన‌తి

ఢిల్లీ – దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యానికి గ‌త స‌ర్కార్ తూట్లు పొడిచింద‌ని ఆవేద‌న చెందారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. బుధ‌వారం ఆయ‌న పీఎం మోడీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.

ఈ సంర‌ద్బంగా ఏపీలో కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర విజన్ ను ప్రధాని ఎదుట ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయిస్తే, దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు.

ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా చేశారని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలు పెట్టేందుకు సంపూర్ణ డీపీఆర్ ను తయారు చేశామ‌న్నారు. పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించామ‌ని తెలిపారు.

దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని కోరారు. దీనికి పీఎం సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం.