తక్షణమే నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి – షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని దీనిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఏపీ డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్.
కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని ఆరోపణలు వచ్చాయి.
భూ కేటాయింపులు, సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైనా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వివరాలు చూసి స్పందించారు ఉప ముఖ్యమంత్రి .తిరుపతిలోని శేషాచలం అడవులకు ఆనుకుని ఉన్న ఉపాధ్యాయనగర్ గ్రాండ్ వాల్ట్ రోడ్డులో అటవీ సరిహద్దు కంచె ధ్వంసం కావడంతో వన్యప్రాణులు దప్పిక కోసం, తిండి కోసం బయటకు వస్తూ ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నాయని వాపోయారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి అటవీ, బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిధిలో ఉన్న ఫెన్సింగ్ కు తగిన మరమ్మతులు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు.
శేషాచలం పరిధిలో మానవ ఆవాసాలకు అనుసంధానం అయిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, నీటి తొట్టెల ఏర్పాట్లు చేయాలని, వన్యప్రాణుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శేషాచలం పరిధిలో ఉన్న కంచె పాడవడానికిగల కారణాలను తెలియజేయాలని ఆదేశించారు.తిరుపతిలో శేషాచలం అడవుల పరిధిలో అటవీ శాఖ అత్యంత సుందరంగా నిర్మించిన దివ్యారామం క్షేత్రంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేయడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పీసీసీఎఫ్ పి. చలపతిరావును విచారణ చేయాలని ఆదేశించారు.