కలాం ప్రస్థానం స్పూర్తి దాయకం – డిప్యూటీ సీఎం
ఆయన జీవితమే ఓ సందేశమన్న పవన్ కళ్యాణ్
అమరావతి – పత్రికలు ఇంటింటికి తిరుగుతూ వేసే పేపర్ బాయ్ నుంచి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. అక్టోబర్ 15న కలాం జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు.
భారత రత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అత్యంత సాధారణమైన కుటుంబంలో జన్మించి ఇస్రో శాస్త్రవేత్తగా, భారత దేశానికి 11వ రాష్ట్రపతిగా ఎదిగి దేశానికి ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాదు ప్రపంచానికి భారత్ సత్తా ఏమిటో చాటి చెప్పిన అరుదైన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు. ఆయన జీవితమే ఓ సందేశమన్నారు.
కలాం వినయం, దృష్టి, జ్ఞానం , విద్య పట్ల అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు. కలాం వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా, తరతరాలకు స్ఫూర్తిగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందిన భారతదేశం రూపొందించడంలో, కలల్ని సాధించడంలో కలాం దార్శనికత , ఆలోచనలు ఎంతగానో ఉపయోగ పడ్డాయని ప్రశంసలు కురిపించారు . అంతే కాదు భారతదేశాన్ని పటిష్టంగా, సుసంపన్నంగా, సమర్ధవంతంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.