విధ్వంసం నుంచి విజయ తీరాలకు చేరాలి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – వికసిత భారతంలో ఆంధ్రప్రదేశ్ చిరునవ్వులు విరబూయాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. విధ్వంసం నుంచి విజయ తీరాలకు రాష్ట్రం పురోగమించాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టి కృషి అవసరం అన్నారు.
అధికార గణం వారి బలాన్ని వారే తెలుసుకోవాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. వ్యవస్థలను బలోపేతం చేసి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. భవిష్యత్తను అంచనా వేయడంలో చంద్రబాబు దూరదృష్టి అద్భుతం అన్నారు. గత ప్రభుత్వం దుబారా ఖర్చులతో ప్రజా ఖజానాను విచ్ఛిన్నం చేసిందన్నారు.
రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక, డోలీల్లో రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితి ఉండటం బాధాకరమని ఆవేదన చెందారు పవన్ కళ్యాణ్. అక్కడ రోడ్ల సదుపాయం, వైద్య సౌకర్యాల మెరుగుదలకు సుమారుగా రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారని తెలిపారు. ఇంతటి కీలకమైన సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధులు లేవన్నారు.
గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు, జగనన్న సర్వే రాళ్లు పాతేందుకు రూ.1200 కోట్ల రూపాయలను దుబారా చేసిందని ఆరోపించారు. వ్యవస్థలను గాడిలో పెట్టే కీలకమైన శక్తి ప్రభుత్వ కార్యనిర్వాహక యంత్రాంగం దగ్గర ఉందన్నారు.