గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మెగాస్టార్ చిరు
గుంటూరు జిల్లా – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు , ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కొణిదెల స్పందించారు. చెప్పలేనంత సంతృప్తి తనకు కలిగిందన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనకు అన్నయ్యగా లభించడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఆయన మేరు పర్వతం లాంటి వాడని కొనియాడారు. తనతో పాటు వేలాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచాడని తెలిపారు.
ఎవరి మద్దతు లేకుండానే స్వంతంగా స్వయం కృషితో అంచెలంచెలుగా సినీ రంగంలో ఎదిగాడని, ఆయన జీవితం నిత్యం ప్రాతః స్మరణీయమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల. ప్రస్తుతం తాను ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నానని, అందుకే తన సోదరుడిని కలువలేక పోయానని తెలిపారు.
తాను ఎక్కడ ఉన్నా తన అన్నయ్య , వదినె, సోదరులు, కుటుంబీకులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటానని వెల్లడించారు పవన్ కళ్యాణ్ కొణిదెల. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సందర్బంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కొణిదెల స్పందించడం విశేషం.