బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత – పవన్
పంచాయతీరాజ్..గ్రామీణాభివృద్ది శాఖలలో
అమరావతి – ఓ వైపు హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల మరో వైపు పాలనా పరంగా మరింత పట్టు పెంచుకునే పనిలో ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీలపై సమీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక సూచనలు చేశారు.
ఈ సందర్బంగా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల. మార్గదర్శకాలను, నిబంధనలను అనుసరించి పారదర్శకంగా చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సి.ఈ.ఓ., డి.ఎల్.డి.ఓ. బదిలీల ప్రక్రియలో మాతృ శాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామం అని ఉప ముఖ్యమంత్రివర్యులు అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకూ అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్నవారికి జిల్లా స్థాయి పోస్టింగ్స్ ఇచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. నెల్లూరు జిల్లా జడ్పీ సి.ఈ.ఓ.గా బదిలీ అయిన ఎస్.ఖాదర్ బాషా 1999 నుంచి ఉద్యోగంలో ఉన్నా జిల్లా స్థాయి పోస్టుల్లో చేయలేదని తెలిపారు.
కృష్ణా జిల్లా డి.పి.ఓ.గా బదిలీ అయిన డా.అరుణకు కుటుంబ పరమైన ఇబ్బందుల విషయాన్ని తెలుపుతూ వినతి ఇచ్చారని… ఆమె బిడ్డకు ఆటిజం సమస్య ఉందనీ, తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారని అందులో పేర్కొన్నారన్నారు.
వారికి వైద్య అవసరాల దృష్ట్యా బదిలీ కోరుకున్నారని ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు వివరించారు. సందీప్ అనే అధికారిని విజయనగరం జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బదిలీ చేశామని తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇప్పటి వరకూ అనకాపల్లి డ్వామా పి.డి.గా బాధ్యతల్లో ఉన్నారని, అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో చేస్తారనే గుర్తింపు ఉందని వివరించారు.