డొక్కా సీతమ్మ దాత్వత్వం తెలియాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – భావి తరాలకు డొక్కా సీతమ్మ దాతృత్వం గురించి తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధ్యాహ్న భోజన పథకానికి అపర అన్నపూర్ణ పేరు సబబు అని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే కాంటీన్లను ఎన్టీఆర్ పేరుతో కొనసాగించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే క్యాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకొంది. వీటికి ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్లు కొనసాగించాలా లేక డొక్కా సీతమ్మ పేరు చేర్చాలా అనే దానిపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా క్యాంటీన్లు కొనసాగించాలని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చనే ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లారు.
డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తే ప్రతి విద్యార్థికి సీతమ్మ గారి గొప్పదనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగిన వారి పేర్ల మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.