డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల
విజయవాడ – పుస్తకాలు కనిపించని ఆయుధాలు అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుస్తక మహోత్సవం నిర్వహించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. జీవితంలో తనకు నిలబడే ధైర్యాన్ని పుస్తకాలు ఇచ్చాయన్నారు. పుస్తకాలను తాను సంపదగా భావిస్తానని చెప్పారు. పుస్తకాలు గనుక లేక పోతే తాను ఏమై పోయి ఉండేవాడినోనని అన్నారు. చదువు రాక పోయినా అన్నీ నేర్చుకునే అవకాశం బుక్స్ ద్వారా కలిగిందన్నారు.
రాజకీయాలలో వచ్చేందుకు, తాను రెండు చోట్లా ఓడి పోయిన సమయంలో అధైర్య పడకుండా ఉండేందుకు పుస్తకాలు సహకారం అందించాయని చెప్పారు కొణిదల పవన్ కళ్యాణ్. భారత్ లో విజ్ఞాన సమూహం అవసరమని అన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహితీ యాత్రకు త్వరలో శ్రీకారం చుడతామన్నారు. సాహితీ వేత్తలు, రచయితల ఇళ్లను ఆలయాల్లా కాపాడు కోవాలని అన్నారు. యువతరం సోషల్ మీడియాను వదిలి పుస్తక పఠనం అలవర్చు కోవాలని సూచించారు. భాషను బతికించు కునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కోటి రూపాయలు ఉన్నా ఇస్తా కానీ మంచి పుస్తకాన్ని తాను ఇవ్వలేనని అన్నారు పవన్ కళ్యాణ్. తనకు రవీంద్ర నాథ్ ఠాగూర్ స్పూర్తి అని చెప్పారు. అమృతం కురిసిన రాత్రి, విశ్వ దర్శనం పుస్తకాలు తనను ఎంతో ప్రభావితం చేశాయన్నారు. డాక్టర్ కేశవ రెడ్డి అతడు అడవిని జయించాడు, విశ్వనాథ హాహా ఊహూ గొప్ప పుస్తకాలన్నారు.