పల్లెలు ప్రగతికి దారులు కావాలి – పవన్
గ్రామ సభలు పరిష్కార వేదికలుగా మారాలి
అమరావతి – పల్లెలు దేశ అభివృద్దిలో కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొలుత శ్రీకారం చుట్టింది డిప్యూటీ సీఎం.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర మంతటా 13,326 గ్రామ సభలు చేపట్టారు. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదన్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం రైల్వే కోడురు నియోజకవర్గం పరిధిలోని మైసూరావారి పల్లి గ్రామంలో చేపట్టిన గ్రామ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. పల్లెలు ప్రగతికి దారులు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ సభలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని, ఆయా గ్రామాలలో ఉంటున్న గ్రామస్థులు ఎవరైనా సరే తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదెల. ఇందులో ఏ పార్టీకి చెందిన వారైనా పాల్గొన వచ్చని, తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలు కల్పించామన్నారు.