ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రకృతి ప్రేమికుడినని అన్నారు. తనకు చిన్నతనం నుంచే ఈ ప్రకృతి అన్నా, మనుషులన్నా, మొక్కలన్నా చాలా ఇష్టంగా ఉండేదన్నారు. తనకు వీలు కుదిరినప్పుడల్లా పుస్తకాలు చదవడంతో పాటు ప్రకృతిలో లీనమయ్యే వాడినని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా తాను మొక్కలకు నీళ్లు పోయడం, వాటిని సంరక్షించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తానని చెప్పారు.
బుధవారం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంపై జరిగిన కన్సల్టేటివ్ వర్క్‌షాప్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా తాను ఏరికోరి అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖను తీసుకోవడానికి కారణం ప్రకృతిపై ప్రేమ, అనురాగం కలిగి ఉండడమేనని స్పష్టం చేశారు .
తాను పర్యావరణం బాగుండాలని కోరుకుంటానని, ప్రకృతితో ప్రతి ఒక్కరు మమేకం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్. సమాజం బాగుండాలంటే , మానవ జాతి పదిలంగా ఉండాలంటే ప్రకృతిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్చంధ సంస్థలు, పెద్దలు, మేధావులు, పర్యావరణ ప్రేమికులు తమకు తోచిన మేరకు సేవలు అందిస్తున్నారని అన్నారు.