అమిత్ షా అడిగితే ఎంపీకి సై
జనసేన పార్టీ చీఫ్ పవన్ ప్రకటన
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తాను శాసన సభ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అయతే ఒకవేళ కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా గనుక తనను ఎంపీగా పోటీ చేయమని అడిగితే వెంటనే పోటీ చేసేందుకు ఒప్పుకుంటానని అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ కుమార్ ను ప్రకటించారు. తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటానని చెప్పారు పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల్లో ధర్మానికి, నీతికి, అధర్మానికి, అవినీతికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని, దీనికి చరమ గీతం పాడేందుకు జనం సిద్దంగా ఉన్నారని అన్నారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఆరు నూరైనా సరే ఈసారి జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు.
తమ కూటమికి కనీసం 150 సీట్లకు పైగానే వస్తాయని, ఇక ఎంపీ సీట్లలో 25 సీట్లకు గాను 20 సీట్లకు పైగా క్లీన్ స్వీప్ చేస్తామని జోష్యం చెప్పారు.