సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం
వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తిరుపతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్దమని ప్రకటించారు.
తాను నా ధర్మానికి అన్యాయం, అవమానం జరుగుతుంటే నన్ను మాట్లాడ వద్దని, రాజకీయం చేయొద్దని అంటున్నారని , కానీ చూస్తూ ఎలా ఉండగనని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్, నా తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయితే నేను మాట్లాడకూడదా అని అన్నారు.
సూడో సెక్యులరిజం ముసుగులో మాట్లాడే మేధావులకు చెబుతున్నా, తాను నిజమైన సనాతనవాదిని, సనాతన హిందువునని, అన్ని మతాలను గౌరవిస్తానని అన్నారు. నేను పరాజయం చెందినా, పరాభవం పొందినా నేను ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాను అంటే నా సనాతన ధర్మంపై ఉన్న నమ్మకం నన్ను నడిపించేలా చేసిందన్నారు.
నా శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో దాడి చేశారు, విగ్రహం తల నరికేశారు, రామాయణం కల్పవృక్షం అంటే కాదు విషవృక్షం అని అన్నారు, మరి మాకు కోపాలు రావా అని మండిపడ్డారు. ఏరోజు ధర్మం తప్ప లేదన్నారు. మసీద్ నుండి అజాన్ వినిపిస్తే నా ప్రసంగం ఆపేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను ఊరుకోననని, బయటకు వస్తానని, పోరాటం చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తానని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి పోయినా పర్వా లేదని, ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత దూరమైనా వెళతానని స్పష్టం చేశారు.