ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు తమ కూటమిదే పవర్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు పాలించిన జగన్ రెడ్డి సర్వ నాశనం చేశారని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో మన్యం ప్రాంతమంతా కూటమి పార్టీల జెండాలతో రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.
కూటమి సర్కార్ ను దీవించాలని, మీకోసం , రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు.
ఏపీని అభివృద్ధిలో నెంబర్ వన్ గా దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అడవి బిడ్డలకు అండగా ఉంటామని చెప్పారు. ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదని, గిరిజనుల సంక్షేమమే ముఖ్యమన్నారు. 2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందానని అన్నారు. మూడు నెలల క్రితం రోడ్ల అభివృద్ధికి మళ్లీ వస్తానన్న మాటతో “అడవితల్లి బాట”తో మీ ముందుకి వచ్చానంటూ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏజెన్సీ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లు ఖర్చు చేస్తే తాము వచ్చాక ఏడాది లోపే రూ. 1,005 కోట్లు మంజూరు చేశామన్నారు.