నాకు బుగ్గలు నిమరడం తెలియదు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల
పార్వతీపురం మన్యం జిల్లా – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనకు బుగ్గలు, తల నిమరడం తెలియదన్నారు. అధికారంలో లేనప్పుడు మన్యంలో తిరిగాను..వారి ఇబ్బందులు గమనించానని..ఇప్పుడు పవర్ లోకి వచ్చాక మిమ్మల్ని కలిసేందుకు మరోసారి వచ్చానని అన్నారు.
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రెండు నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున మన్యంలో పర్యటిస్తానని చెప్పారు. మీ కోసం పని చేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారని ఆ బాధ్యతను గుర్తించే పనులు చేపడుతున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.
గిరిజన ప్రజలందరికీ మాటిస్తున్నానని, మీ కోసం ఒళ్లు వంచి పని చేస్తానని అన్నారు. గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు.
ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియ చేయాలని ఆదేశించారు.