పార్లమెంట్ లో ప్రజా గొంతును వినిపించండి
జనసేన పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ హితబోధ
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. ఎంపీలకు పార్లమెంట్ లో ఏమేం మాట్లాడాలనే దానిపై సూచనలు చేశారు. ఎక్కడా తగ్గవద్దని జనసేన ప్రజల గొంతుక వినిపిస్తుందని చెప్పే ప్రయత్నం చేయాలని అన్నారు.
ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఎంపీలుగా గెలిపించారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదెల. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలో చోటు చేసుకున్న సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరంగా ఆయా నియోజకవర్గాలకు రావాల్సిన నిధుల గురించి , పెండింగ్ లో ఉన్న పనుల గురించి ప్రశ్నించాలని , ఆయా శాఖల కేంద్ర మంత్రులతో కలిసి సమస్యల పరిష్కారం గురించి వినతి పత్రాలు సమర్పించాలని దిశా నిర్దేశం చేశారు జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం.
ఇదిలా ఉండగా ఈ నెల 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై కీలక సూచనలు అందజేశారు.