అసెంబ్లీలో ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్
ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్
అమరావతి – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్ తో ప్రమాణం చేయించారు.
సభ ప్రారంభం కాగానే స్పీకర్ సభ్యులందరికీ సభా సంప్రదాయాలు వివరించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు లేచి నిలబడ గానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.
అనంతరం పవన్ కళ్యాణ్ ప్రొటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి పవన్ కళ్యాణ్ తో రిజిస్టర్ లో సంతకాలు స్వీకరించారు. సభలోకి అడుగు పెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరస్పరం ఆలింగనం చేసుకున్నారు.