ఏపీ సీఎం నిధికి రూ. 50 లక్షలు విరాళం
అమరావతి – తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అలియాస్ బన్నీ తన ఉదారతను చాటుకున్నారు. వాయవ్య బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఏపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా నీళ్లే అగుపిస్తున్నాయి. 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అన్నీ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ వంతుగా సాయం చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, టెక్నిషీయన్స్, నిర్మాతలు స్పందించారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ తన వంతు బాధ్యతగా ఏపీ వరద బాధితుల కోసం రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్బంగా బన్నీకి ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన మీ ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు .