పంట కాలువ కబ్జాపై పవన్ ఆగ్రహం
తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశం.
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని కోలంక గ్రామంలో పంట కాలువను కబ్జా చేసిన ఘటన ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.
ఈ అంశంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. 60 ఎకరాలకు సాగు నీరు వెళ్ళే పంట కాలువను లే ఔట్ కోసం కబ్జాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆదేశించారు. తక్షణమే పంట కాలువను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
గతంలో సర్వే చేసినా ఎందుకు ఆక్రమణలు తొలగించలేదని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ‘ఎవరు తప్పు చేసినా… నాతో సహా… ఉపేక్షించవద్దు, చట్టం, నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలి’ అని చెప్పిన మాటలను గుర్తు చేశారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. కోలంక గ్రామంలో గ్రావెల్ తో పంట కాలువను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టారు. పంట కాలువ పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు పనులు చేస్తున్నారు.