విజయవాడ వద్దు మంగళగిరి ముద్దు
సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనిదెల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తనకు విజయవాడ లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం వద్దని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనకు ప్రత్యేకంగా బెజవాడలో ఆధునిక వసతి సౌకర్యాలతో క్యాంప్ ఆఫీస్ ను కేటాయించారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. తనకు విజయవాడ వద్దని , మంగళగిరి అయితేనే బాగుంటుందని లేఖ రాశారు. తాను తన నివాసం నుంచే కార్యకలాపాలు సాగిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా విజయవాడ క్యాంపు కార్యాలయ భవనాన్ని, ఫర్నిచర్ ను వెనక్కి తీసుకోవాలని సీఎంను కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇకపై మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నందున, విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని జనసేనాని వివరణ ఇచ్చారు.