NEWSANDHRA PRADESH

గేట్ విష‌యంపై అప్ర‌మ‌త్తం చేశాం

Share it with your family & friends

ఏపీ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్

అనంత‌పురం జిల్లా – ఏపీ ఆర్థిక‌, ప్ర‌ణాళిక‌, వాణిజ్య ప‌న్నులు , శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తుంగ‌భ‌ద్ర డ్యామ్ గేట్ కొట్టుకు పోవ‌డంపై స్పందించారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే తాను ఉన్నతాధికారుల‌తో మాట్లాడాన‌ని తెలిపారు. ఆదివారం ఆయ‌న వీడియో వాయిస్ మెస్సేజ్ ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

సాధ్యమైనంత త్వరలోనే తుంగభద్ర డ్యామ్ గేట్ ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశించార‌ని చెప్పారు. కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకు పోయిన విషయం ఇవాళ ఉదయం తెలిసింద‌న్నారు.

వెంట‌నే డ్యామ్ ఉన్నతాధికారుల‌తో చ‌ర్చించాన‌ని ప‌య్యావుల కేశ‌వ్ వెల్ల‌డించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది తుంగభద్ర డ్యామ్ అని, ఈ డ్యామ్ ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు వివిధ పంటలను వేశార‌ని చెప్పారు.

తుంగభద్ర డ్యామ్ పురాతనమైన డ్యామ్ కావడంతో అక్కడ స్టాప్ లాగ్ గేట్ అలైన్మెంట్ డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించే అంశమని, ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చి గేట్లు కొట్టుకు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకొక గేటును దించుకునే అవకాశం కొత్తగా వచ్చే డ్యాముల్లో డిజైన్ చేస్తున్నారని తెలిపారు.

టీబీ డ్యామ్ లో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తులు, సుదీర్ఘమైన అనుభవం క‌లిగిన‌, రిటైర్డ్ అయిన గన్నయ్య నాయుడు, ఇతర వ్యక్తులను సంప్రదించడం జరిగిందన్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం డ్యామ్ గేట్ ని పునరుద్ధరించే పనిలోనే ఉందన్నారు..