Saturday, April 19, 2025
HomeDEVOTIONALభ‌క్తుల‌కు మలయప్ప స్వామి దర్శనం

భ‌క్తుల‌కు మలయప్ప స్వామి దర్శనం

పెద్ద శేష వాహ‌నంపై ఊరేగిన స్వామి

తిరుమల – నాగుల చవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల‌లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేష వాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌నం ఇచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

సర్పరాజైన ఆది శేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామి వారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్ర నామాలతో శేష సాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు.

అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామి వారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆది శేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.

ఈ విధంగా స్వామి వారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో క‌లిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నాడు. అందుకే స్వామి వారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments