ప్రకటించిన కూటమి ప్రభుత్వం
అమరావతి – ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 వేల 36 మంది పెన్షన్లను తొలగించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శనివారం ఉదయాన్నే లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేసింది. దివ్యాంగ కేటగిరీ కింద పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను గుర్తించడం జరిగిందని తెలిపింది.
గత జనవరి నెలలో 63,77,943 మంది దివ్యాంగ పెన్షన్లు అందుకోగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆ సంఖ్య 63 , 59, 907కు తగ్గింది. జాబితా నుంచి తొలగించిన వారు ఇక నుంచి పెన్షన్లు పొందేందుకు అర్హులు కారు. కాగా అనర్హులు ఏయే జిల్లాల్లో ఉన్నారనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది సర్కార్.
గత వైఎస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అనర్హులకు అందలం ఎక్కించారని, దీని వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై పూర్తి విచారణ చేపడతామని, ఆయా జిల్లాల్లో ఇప్పటి దాకా పెన్షన్లు అందుకున్న వారి వివరాలను సేకరిస్తామని తెలిపింది. ఇప్పటి వరకు తీసుకున్న వాటిని రికవరీ కూడా చేస్తామని హెచ్చరించింది.
ఇదే సమయంలో దివ్యాంగులని సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై కూడా ఆరా తీస్తామని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది.