కూటమి పాలనకు ప్రజాశీర్వాదం
మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్
అమరావతి – రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం , బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వానికి వంద మార్కులు వేశారని అన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలల కాలం పూర్తయిన సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. సమర్థవంతమైన నాయకుడైన టీడీపీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రగతి పథంలో పోలీస్ శాఖ పయనిస్తోందన్నారు మంత్రి వంగలపూడి అనిత.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తాము సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని తెలిపారు . అమరులైన పోలీసు కుటుంబాలకు గతంలో రూ. 25 వేలు మాత్రమే ఇచ్చారని, కానీ తాము తక్షణ సాయం కింద రూ. లక్ష పెంచామన్నారు.
గతంలో జగన్ రెడ్డి వైసీపీ సర్కార్ పోలీసు శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో పోలీసు శాఖకు భారీ ఎత్తున రూ. 8,495 కోట్లు కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.
గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం కోసం ఈగల్ ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 పోలీస్ బెటాలియన్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు వంగలపూడి అనిత.