ఆ పార్టీలను జనం నమ్మరు
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్
అమరావతి – రాష్ట్రంలో ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని, వారికి అంత సీన్ లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా చేస్తాయని జోష్యం చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఏకి పారేశారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పురంధేశ్వరి , షర్మిల కనిపిస్తారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పని చేసే వారికే పట్టం కడతారని ఆ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు పేర్ని నాని.
తాను మంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు బ్లాక్ లో టికెట్ల దందాపై ఉక్కు పాదం మోపానని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు పేర్ని నాని. ఇక వై నాట్ 175 అనేది తమ నినాదమని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక బాబు, పవన్ , పురందేశ్వరి, షర్మిలలను పగటి కలలు కంటున్నారని అవి చెల్లుబాటు కావని పేర్కొన్నారు.