పడినా లేచినా జగన్ తోనే జర్నీ – పేర్ని
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, మస్తాన్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేయడంపై స్పందించారు. ఎవరు ఉన్నా లేక పోయినా వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు పేర్ని నాని.
ఎన్ని ఇబ్బందులు పడినా చివరకు అంతిమ విజయం తమదే అవుతుందని నమ్మకం కలిగిన అరుదైన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. తాము గెలుపు ఓటములను సమానంగా చూస్తామని చెప్పారు. ప్రజల తరపున తమ గొంతు వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు పేర్ని నాని.
రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీస్తూనే ఉంటామని అన్నారు. పార్టీ జగన్ రెడ్డి కష్టార్జితమని, ప్రజలతో పాటే తను కూడా ముందుకు వెళతారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు పేర్ని నాని.
వైసీపీ పడినా లేచినా జగన్ మోహన్ రెడ్డితోనే తాము ఉంటామని కుండ బద్దలు కొట్టారు మాజీ మంత్రి. ఆయన వెన్నంటే ఉంటానని ప్రకటించారు.