జగన్ రెడ్డి వైపే జనం
స్పష్టం చేసి పేర్ని నాని
అమరావతి – మేం ఏం చేస్తామో ముందే చెప్పామని, పవర్ లోకి వచ్చాక చేసి చూపించామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తిరిగి జగన్ కే ఎందుకు ఓటు వేయాలో కూడా వివరించడం జరిగిందన్నారు. అందుకే బాజాప్తా సిద్దం సభ ద్వారా తెలియ చేశామని చెప్పారు.
సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అయితే తమకు ఓటు వేస్తే ఏం చేస్తామనే విషయాన్ని ప్రధాని మోదీ కానీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చెప్పలేక పోయారని ఎద్దేవా చేశారు.
ప్రజలు పని చేసే వాళ్లకు పట్టం కడతారని, మాటలు చెప్పి మోసం చేసే వాళ్లను దగ్గరకు రానివ్వరంటూ పేర్కొన్నారు పేర్ని నాని. కాకినాడలో పాచి పోయిన లడ్డూలు చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయంటూ ఎద్దేవా చేశారు.
ఐదేళ్ల కిందట చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనరాని మాటలు అన్నారని, ఆపై రాహుల్ గాంధీని పొగిడారని, కానీ ఇప్పుడు ఎందుకు కాళ్ల బేరానికి వచ్చాడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరి ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు పొత్తు పెట్టుకున్నావో చెప్పాలన్నారు.