ఎస్ఐబీ మాజీ చీఫ్ పై రెడ్ కార్నర్ నోటీస్
పరారీలో ఉన్న ప్రభాకర్ రావు
హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించ లేదు. గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ కు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అంతే కాకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు, మేధావులు, కవులు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టారని, రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని, ఫోన్ ట్యాపింగ్ చేసేలా వ్యవహరించారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు విచారణకు ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు చెక్కేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ కుంటి సాకులు చెబుతూ వచ్చారు. దీంతో లుక్ అవుట్ నోటీసులు మొదటగా జారీ చేసింది. కానీ స్పందన లేక పోవడంతో తాజాగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది పోలీసు శాఖ.
ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ పై కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం విశేషం. ఇదిలా ఉండగా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి తెలిపింది తెలంగాణ సీఐడీ. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేసినా తప్పించుకుంటూ వస్తున్నారు.