ప్లాట్‌ఫారమ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలి
సీరియస్ కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్లాట్ ఫారమ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా సంస్థలు దీనిని తప్పక పాటించాల్సిందేనంటూ కుండ బద్దలు కొట్టింది.
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ ప్లాట్ ఫారమ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా , ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, కొరియర్ , ఓలా, ఊబెర్ , జొమాటో , స్విగ్గీ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేసే కార్మికులు లక్షలాది మంది దేశ వ్యాప్తంగా పని చేస్తున్నారని , వారికి సామాజిక భద్రత అన్నది ముఖ్యమని స్పష్టం చేసింది. వాళ్లు కూడా మనుషులేనని, వారికి కూడా హక్కులు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని పేర్కొంది ధర్మాసనం.
ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం సామాజిక భద్రతా చర్యలను అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఐఎఫ్ఏటీ తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య ప్రయోజనాలు, బీమా , పెన్షన్ పథకాలతో సహా గిగ్ ప్లాట్‌ఫారమ్ కార్మికులకు సామాజిక భద్రతా నిబంధనలను నిర్ధారించడానికి బాధ్యత వహిస్తాయని అన్నారు.
2021 నుండి ఈ అంశం పెండింగ్‌లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంలో జాప్యం చేయడాన్ని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. విధాన నిర్ణయాల అవసరాన్ని పేర్కొంటూ యూనియన్ తరపు న్యాయవాది అదనపు సమయం కోరారు. న్యాయస్థానం యూనియన్‌కు తన ప్రత్యుత్తర-అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి మూడు వారాల సమయం ఇచ్చింది, ఇది సమ్మతి కోసం చివరి అవకాశంగా గుర్తించ బడింది.