అమెరికాకు బయలుదేరిన మోడీ
మూడు రోజుల పాటు పీఎం పర్యటన
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ అమెరికా పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా యుఎస్ టూర్ లో భాగంగా మూడు రోజుల పాటు పర్యటిస్తారు పీఎం.
ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశం (అసెంబ్లీ)లో పాల్గొని ప్రసంగిస్తారు నరేంద్ర మోడీ. క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అక్కడ అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తో సమావేశం కానున్నారు పీఎం.
కాగా తన అమెరికా పర్యటన భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జపాన్, ఆస్ట్రేలియాతో సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కోవిడ్-19 మహమ్మారి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత, వాతావరణ మార్పు తదితర అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తన పర్యటనను ముగించనున్నట్లు ప్రధాన మంత్రి అమెరికా పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.