అచ్యుతాపురం ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు
ఢిల్లీ – అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ప్రమాద ఘటనపై స్పందించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు ప్రధానమంత్రి. ఇదే సమయంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఈ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నరేంద్ర మోడీ. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి కింద పరిహారం ప్రకటించారు .
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా అచ్యుతాపురం ఘటనలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో వైపు విశాఖ జిల్లా కలెక్టర్ మృతుల కుటుంబం ఒక్కొక్కరికీ రూ. కోటి పరిహారం ఇస్తున్నట్లు వెల్లడించారు.