మన్మోహన్ సింగ్ కు మోడీ బర్త్ డే విషెస్
ఈ దేశానికి చేసిన సేవలు అభినందనీయం
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ మాజీ ప్రధాన మంత్రి, ప్రపంచం మెచ్చిన దిగ్గజ ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు.
ఇదే రోజు 1932లో పంజాబ్ రాష్ట్రంలో పుట్టారు మన్మోహన్ సింగ్. సౌమ్యుడు, మృధు స్వభావిగా పేరు పొందారు. అప్పటి దివంగత ప్రధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహా రావు (పీవీ నరసింహారావు) ప్రభుత్వ హయాంలో కీలకమైన పాత్ర పోషించారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.
భారత దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో తీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఊహించని రీతిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రధానమంత్రిగా కొలువు తీరారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాల కారణంగా ఇవాళ ఇండియా వెలుగుతోంది.
ఐటీ, వ్యాపార, వాణిజ్య, లాజిస్టిక్, ఆటో మొబైల్స్ , తదితర కీలక రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతోంది. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.