సంతకం చేసిన చెస్ బోర్డు బహూకరణ
ఢిల్లీ – తమిళనాడుకు చెందిన చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు తన పేరెంట్స్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా భారత దేశానికి పేరు తీసుకు వచ్చినందుకు అభినందించారు పీఎం. గుకేశ్ సంతకం చేసిన చదరంగం బోర్డును మోడీకి కానుకగా అందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు పీఎం.
ప్రపంచ చదరంగం రంగంలో అత్యంత పిన్న వయసు కలిగిన గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించాడు గుకేశ్ దొమ్మరాజు. తండ్రి సర్జన్, తల్లి ప్రొఫెసర్. తమ స్వస్థలం ఏపీ రాష్ట్రం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ టైటిల్ ను గెలుచుకున్న రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు గుకేశ్ దొమ్మరాజు.
సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 14వ గేమ్ లో చైనాకు చెందిన దిగ్గజ ఆటగాడు డింగ్ లిరెన్ ను గుకేష్ ఓడించాడు. అందరినీ విస్మయానికి గురి చేశాడు. కృషి, పట్టుదల తనలో కనిపించిందని అదే తనను విజేతగా నిలిపేలా చేసిందని పేర్కొన్నారు నరేంద్ర మోడీ.
కాగా 1985లో 22 ఏళ్ల వయసులో ఛాంపియన్ గా నిలిచిన రష్యన్ చెస్ లెజండ్ గ్యారీ కాస్పరోవ్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తమిళనాడు ప్రభుత్వం గుకేష్ దొమ్మరాజుకు రూ. 5 కోట్ల బహుమతిని ప్రకటించింది.