అనుర దిసనాయకేకు అభినందనలు
ఢిల్లీ – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మార్క్సిస్ట్ భావ జాలం కలిగిన అనుర కుమార దిస నాయకే. ఈ సందర్భంగా అనుర కుమార దిస నాయకేకు అభినందనలు తెలిపారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మీరు సాధించిన విజయం అభినందనీయమని పేర్కొన్నారు ప్రధానమంత్రి. గత కొన్నేళ్లుగా భారత దేశం శ్రీలంకతో సత్ సంబంధాలను కలిగి ఉందని , మీ కొత్త నాయకత్వంలో శ్రీలంక మరింత పురోగతి సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.
భారతదేశానికి సంబంధించి నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ , విజన్ పరంగా శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు. ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మా బహుముఖ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో సన్నిహితంగా పని చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా తనను అభినందించిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసనాయకే. భారత్ తో తమ బంధం ఎల్లప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.