తెలంగాణలో బలపడుతున్న బీజేపీ
స్పష్టం చేసిన పీఎం నరేంద్ర మోదీ
జగిత్యాల – తెలంగాణలో క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ బలపడుతోందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సన్నద్దం అవుతున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కోసం ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధానమంత్రి.
లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు పతనం కావడం ఖాయమని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మోదీ. దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు సుస్థిరమైన పాలనను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ తిరిగి మూడోసారి కేంద్రంలో పవర్ లోకి వస్తుందని చెప్పారు .
తాను ప్రధానమంత్రిగా వచ్చాక దేశంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేశానని అన్నారు. ఇవాళ ప్రపంచంలో భారత్ టాప్ లో నిలిచిందన్నారు నరేంద్ర మోదీ. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఇండియా నెంబర్ వన్ గా ఉందన్నారు. దీనికంతటికీ తమ సర్కారే కీలకమని స్పష్టం చేశారు.